అది 150 కిలోమీటర్ల నిడివి, పెద్దగా మలుపులు లేని విశాలమైన నాలుగు వరుసల రహదారి, దేశంలోనే అతి పొడవైన రహదారి మన రాష్ట్రంలో రెండు ప్రముఖ నగరాలను కలుపుతూ వెళుతుంది అదే ఎన్ హెచ్ 7 కానీ అధికారుల బాధ్యతారాహిత్యం, గుత్తేదారుల ధనాపేక్ష , సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అని వెరసి ప్రయాణికుల ప్రాణాలను హరించివేస్తున్నాయి.
నాడు జె.ఎన్.టి.యు ఉపకులపతి ( పామిడి, అనంతపురం జిల్లా), వోల్వో బస్సు సజీవదహనం (పాలెం మహబూబ్ నగర్ జిల్లా), ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్ దుర్ఘటన (వెల్దుర్తి, కర్నూలు జిల్లా) ఇలా ఎన్నో అతి ఘోర రోడ్డు ప్రమాదాలు ఇక్కడే జరిగాయి. వీటన్నింటికీ బాధ్యత ఎవరిది ? ఇలాంటివి మరల పునరావృతం కాకుండా తీసుకున్న నివారణ చర్యలు ఎక్కడ ? ప్రమాదం జరిగిన ప్రతిసారి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, డ్రైవర్ నిద్రలేమి, వాహన సాంకేతిక లోపం, సీటు బెల్టు లాంటి ఏవో సాకులు చెప్పుతూ, తాత్కాలిక చర్యలు చేపడుతూ దీర్ఘకాలిక, శాశ్వత నివారణ చర్యలు అమలు చేయకపోవడం వీటన్నింటికీ మూల కారణం.
ఎన్ హెచ్ ఎ ఐ నియమాల ప్రకారం ప్రతి 50 నుంచి 60 కిలోమీటర్ల గాను ఒక టోల్ ప్లాజా ఉండాలి దీని నిర్వహణ ప్రైవేటు సంస్థల చేత ప్రభుత్వ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఒక అత్యవసర అంబులెన్సు, అత్యవసర వాహనం (టోయింగ్ వాహనం), పబ్లిక్ టాయిలెట్స్ (స్వచ్ఛ భారత్ మిషన్), త్రాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స గది ప్రథమ చికిత్స కిట్ ఉండాలి. వీటన్నింటి సమాచారాన్ని టోల్ రసీదు లపైన, పెద్ద పెద్ద బోర్డులపైన రహదారి పొడుగున టోల్ ప్లాజాల దగ్గర డిస్ప్లే చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఇందులో ఏ ఒక్కటి అమలు చేయడానికి పోగా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా అంబులెన్స్ నంబరు, రక్షక వాహనం నంబరు టోలు రసీదులపై తప్పుగా ప్రచురించి ప్రయాణికులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ మిషన్ "స్వచ్ఛభారత్" ను సైతం ఖాతరు చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, నిర్వహణ చేయకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆరుబయట మల, మూత్ర విసర్జనను ప్రోత్సహిస్తున్నారు.
గుర్తించిన ప్రమాద స్థలాలలో కొత్త రక్షక రైలింగ్ లను నిర్మించకపోవడం లేదా పాడైపోయిన పాత రైలింగ్ లను మరమ్మత్తు చేయించకపోవడం, ప్రమాద కూడళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు, ఎల్ఈడి లైట్ల ఏర్పాటు చేయకపోవడం వలన ఎన్నో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి.
ఈ జాతీయ రహదారి నిర్మాణ మరియు నిర్వహణ లోపాలను, ప్రమాద కారణాలను వాటి నివారణ చర్యలు, మార్గదర్శక సూత్రాలను సంబంధిత అధికారుల, గుత్తేదారుల దృష్టికి వినతి పత్రాలు, సమాచార హక్కు చట్టం, బంద్ ల రూపంలోతీసుకువెళ్లిన వారి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇకపైనైనా నిర్వహణలో నిర్లక్ష్యం వదలకపోతే భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఘోర లేదా అతిఘోర రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త !
ఇట్లు మీ
డా. జంగం శశిధర్
మానవ హక్కుల సంఘం